తగినంత సంఖ్యా బలం లేదని పేర్కొంటూ, టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తిరస్కరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.
టీవీకే నాయకుడు విజయ్, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతును గవర్నర్ రాజ్భవన్లో చూపించలేకపోయారని సమాచారం. బుధవారం మధ్యాహ్నం గవర్నర్ను కలిసిన విజయ్, కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల మద్దతు కూడగట్టామని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, గవర్నర్ విజయ్ సమర్పించిన లెక్కలతో సంతృప్తి చెందలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, కాంగ్రెస్ మద్దతుతో కలిపి టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. విజయ్ రెండు సీట్లలో గెలిచినందున, ఒక స్థానానికి రాజీనామా చేస్తే టీవీకే బలం 107కు తగ్గుతుంది. దీంతో, బలనిరూపణకు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరమని గవర్నర్ స్పష్టం చేశారు.
ఏఐడీఎంకేలోని కొంతమంది ఎమ్మెల్యేలు, పీఎంకే, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం వంటి చిన్న పార్టీల మద్దతు టీవీకేకు లభించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, అధికారికంగా మద్దతు తెలిపితేనే ఆ సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటామని గవర్నర్ సూచించినట్లు సమాచారం.
గవర్నర్ నిర్ణయంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.











