తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్, తన విలక్షణమైన పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే విజయ్ తన కార్యాలయానికి నిర్దేశిత సమయానికి కొద్ది నిమిషాల ముందే చేరుకుంటున్నారు.
ప్రతిరోజూ ఇంటి నుంచి స్వయంగా లంచ్ బాక్స్ తెచ్చుకుంటూ, విజయ్ ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆయన నిబద్ధతను, సాధారణ ప్రజలతో మమేకమవ్వాలనే సంకల్పాన్ని తెలియజేస్తోంది.
భోజన విరామ సమయంలో కూడా తన ఛాంబర్‌కే పరిమితమై, భోజనం ముగించి వెంటనే తిరిగి విధుల్లో నిమగ్నమవుతున్నారని సమాచారం. ఈ అంకితభావం, సమయపాలన రాష్ట్ర అధికార యంత్రాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.







