రాబోయే విద్యా సంవత్సరం లోగా 80 శాతం పూర్తయిన సంక్షేమ వసతి గృహాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆయన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఆయా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు.
వసతి గృహాల మరమ్మత్తు బిల్లులను ప్రతి 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా ఆర్థిక శాఖకు పంపేలా ఒక సీనియర్ అధికారిని నియమించి బాధ్యత అప్పగించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ వేసవిలోగా మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని, అధికారుల నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
సంక్షేమ వసతి గృహాల అద్దెలు, ఎలక్ట్రికల్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు ప్రతినెలా సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం సంబంధిత అధికారులు ఆర్థిక శాఖకు సకాలంలో బిల్లులు పంపాలని సూచించారు. మెటీరియల్ నాణ్యతను నిరంతరం సమీక్షించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామని, బిల్లులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారులు నిత్యం వసతి గృహాలను సందర్శించి, బోధన, భోజన నాణ్యతతో పాటు సదుపాయాలను పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పథకం కింద మెడిసినల్ ప్లాంట్లు పెంచేందుకు ఆయుష్ శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అడవులను కాపాడవచ్చని, వారసత్వ దేవాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.










