తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వేసవి రద్దీ నేపథ్యంలో అన్నదాన క్యాంటీన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేసింది. మే 15 లోగా ఈ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అదనపు కార్యనిర్వహణాధికారి (ఈవో) సీహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేశారు.
తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహంలో జరిగిన సమీక్షా సమావేశంలో, అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యాంటీన్ల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. టీటీడీ నిర్దేశించిన ధరలకే ఆహార పదార్థాలను విక్రయించాలని, హోటళ్లలో సాంప్రదాయ ఆహారాన్ని మాత్రమే అందించాలని ఆయన స్పష్టం చేశారు.
హోటల్ సిబ్బంది తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని, పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
జనతా క్యాంటీన్ల నిర్వాహకులతో కూడా జరిగిన సమావేశంలో, నిబంధనల ప్రకారం భక్తులకు అందుబాటు ధరలలో ఆహారాన్ని అందించాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఇక, కాటేజీ డోనార్ స్కీమ్ కింద నిర్మిస్తున్న విశ్రాంతి గృహాల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని దాతలను అదనపు ఈవో కోరారు. వేసవి రద్దీ దృష్ట్యా, మే 15 లోగా ఈ పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు.











