ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న బూర్జువా పార్టీలను వదిలి, కొత్త రాజకీయ శక్తిగా రాబోతున్న తెలంగాణ జాగృతిలో చేరాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు రాథోడ్ బాపూరావు తన అనుచరులతో కలిసి ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన నాయకులంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి రావాలని కవిత పిలుపునిచ్చారు. 2007లో బోథ్ ప్రాంతంలోని ఆదివాసీలు, గిరిజనుల కోసం తాను వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాటి పరిస్థితుల నుంచి మార్పు రావాలనే తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని, అదే స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేయాలని ఆమె అన్నారు.
బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, తెలంగాణ జాగృతి నుంచే బీఆర్ఎస్ లో చేరి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారని, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరుతున్నారని కవిత తెలిపారు. కొత్త పార్టీలో చేరడానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు ముందుకు వస్తున్నారని, తెలంగాణ ఉద్యమకారులు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందని, సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నాయకులు ఈరోజు జాగృతిలో చేరారని కవిత తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి కవిత ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే తాను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వారు మంత్రులయ్యారని, తనకు మూడోసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ లో చేరినా తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని ఆయన పేర్కొన్నారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చోడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని బాపూరావు అన్నారు.
జనగణనలో ఆదివాసీల మతం కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకులు కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరిస్తోందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని, వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టకపోవడం ఆదివాసీల సంస్కృతిని అవమానించడమేనని, ఆదివాసీలు తమ మతాన్ని చెప్పుకునేలా ప్రత్యేక కాలమ్ పెట్టాలని కవిత కోరారు. ఆదివాసీల భాష ‘‘కోయతూర్’’ ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ చేర్చాలని, తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ దేశ మూలవాసులైన ఆదివాసీల గౌరవాన్ని కాపాడేలా ఉంటుందని ఆమె ప్రకటించారు.











