వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య రాజకీయాలకు జగన్ అలవాటు పడ్డారని, ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న రాధాకృష్ణకు జగన్ నుంచి ప్రమాదం ఉందని, ఆయనపై దాడి చేయించే అవకాశం ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తండ్రిని అడ్డుపెట్టుకొని పరిటాల రవిని, ఆయన అనుచరులను హత్య చేయించిన చరిత్ర జగన్‌ది అని గోరంట్ల ఎద్దేవా చేశారు. జగన్ తన తాత రాజారెడ్డి నుంచి హత్యా రాజకీయాలను వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారని ఆరోపించారు. అధికారం కోసం సొంత బాబాయి వివేకానందరెడ్డినే హత్య చేయించి, కేసులను మాఫీ చేయించుకునేందుకు కుట్రలు చేశారని విమర్శించారు.
జగన్ చేస్తున్న కుట్రలను ప్రజలందరూ గమనిస్తున్నారని, చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టించిన దుర్మార్గుడు జగన్ అని గోరంట్ల ధ్వజమెత్తారు. ఆస్తి కోసం సొంత చెల్లిని, తల్లిని దూరం పెట్టారని దుయ్యబట్టారు. జగన్ వంటి రాక్షసుడు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంతో పాటు దేశమే నాశనం అవుతుందని విమర్శించారు. జగన్ పొరపాటున కూడా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ప్రజలు రానివ్వరని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.











