తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ విమర్శించింది. బడ్జెట్లో బీసీలకు సరైన కేటాయింపులు చేయలేదని, కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను విస్మరించారని పార్టీ ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం బీసీలకు ప్రతి ఏటా ₹20,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఈసారి కేవలం ₹12,000 కోట్లతో సరిపెట్టడం దారుణమని పేర్కొన్నారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి, దానిని అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
రాష్ట్ర జనాభాలో 60 శాతం వాటా కలిగిన బీసీలకు బడ్జెట్లో కేవలం 6 శాతం నిధులు మాత్రమే కేటాయించారని, మరోవైపు 10 శాతం కూడా లేని ఓసీ మంత్రుల ఆధీనంలో 62 శాతం బడ్జెట్ ఉండటం సామాజిక న్యాయానికి విరుద్ధమని పార్టీ ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో, బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో రేపు ఉదయం 10 గంటలకు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ నిరసనల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజేయాలని పిలుపునిచ్చింది.










