రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు తీవ్ర విమర్శలు చేశారు.
కామారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం దెబ్బతింటోందని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల వారి భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇల్లు లేని వారికి గృహాలు, రైతులకు రైతు భరోసా సకాలంలో అందించాలని కోరారు.
గత సోమవారం అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి, వినతిపత్రాలు సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 20న జిల్లా కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు, 23న రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడి చేపడతారని హెచ్చరించారు.
రెండున్నర సంవత్సరాలు గడిచినా హామీల అమలులో పురోగతి కనిపించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని, ప్రజా సమస్యల పరిష్కారం వరకు ఉద్యమం ఆగదని నీలం చిన్న రాజులు స్పష్టం చేశారు.












