మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం మహిళా లోకానికి ఏప్రిల్ 17ను ఒక 'బ్లాక్ డే'గా మిగిల్చిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఇల్లందకుంటలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టి, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం మహిళా వ్యతిరేక ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్లకు మోక్షం లభిస్తున్న తరుణంలో, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ అడ్డుతగలడం దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలను అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. చట్టసభలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే చారిత్రక అవకాశాన్ని కాంగ్రెస్ కాలరాసిందని విమర్శించారు.
బయట మహిళా హక్కుల గురించి మాట్లాడుతూ, పార్లమెంటులో బిల్లును అడ్డుకోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని రమణారెడ్డి అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తూ, దేశ పరిపాలనలో వారి భాగస్వామ్యాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











