కూకట్పల్లి పరిధిలోని ఎల్లమ్మబండ ప్రాంతంలో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు పారిశుధ్య సేవల పేరుతో అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్ణీత రుసుము రూ.100 కు బదులుగా రూ.150 డిమాండ్ చేస్తున్నారని, దీనికి నిరసనగా రోడ్లపైనే చెత్త వేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుధ్యం పేరుతో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు అందినకాడికి దండుకుంటున్నారని, నిర్ణీత రుసుము రూ.100 కు బదులుగా ఏకంగా రూ.150 ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నారని ఎల్లమ్మబండ ప్రాంత వాసులు భగ్గుమంటున్నారు. "గతంలో చెల్లించిన వంద రూపాయల కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదు" అని వారు తేల్చి చెబుతున్నారు.
ఆటో నిర్వాహకుల తీరును తీవ్రంగా పరిగణించిన స్థానికులు, ఏకంగా రోడ్లపైకి వచ్చి ప్రధాన కూడళ్లలో చెత్తను పారబోస్తూ తమ నిరసనను గట్టిగా తెలియజేస్తున్నారు. కూకట్పల్లి పరిధిలోని ఆల్విన్ కాలనీ జీహెచ్ఎంసీ సర్కిల్ కింద ఉన్న ఎల్లమ్మబండ, పరిసర కాలనీల్లో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా మారింది. దీనితో స్థానికంగా దుర్గంధం వెదజల్లుతోంది.
ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు డ్రైవర్లు ఏకపక్షంగా రేట్లు పెంచారని, యాభై రూపాయలు అదనంగా డిమాండ్ చేస్తూ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అడిగినంత ఇచ్చుకోలేని ప్రజలు చెత్తను ఎక్కడ వేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ దోపిడీతో విసిగిపోయిన ప్రజలు ఇళ్లలోని చెత్తను వీధుల్లోనే వేస్తున్నారు.
నెలనెలా వంద రూపాయలు ఇచ్చేందుకు ప్రజలు అంగీకారంతో ఉన్నా, ఆటో డ్రైవర్లు మాత్రం తమ పంతం నెగ్గించుకునేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు తెలిపారు. డ్రైవర్ల ఆగడాలపై జీహెచ్ఎంసీ ఉప సంయుక్త కార్యదర్శికి, ఆల్విన్ కాలనీ సర్కిల్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేదని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అక్రమ వసూళ్లకు కళ్లెం వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.







