సిద్దిపేట జిల్లాలో జరగనున్న TGPSC డిపార్ట్మెంటల్ పరీక్షల సందర్భంగా, పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతలను కాపాడేందుకు, పరీక్షలు సజావుగా జరిగేలా చూడటానికి పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ గారు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS 2023) సెక్షన్ 163 కింద పలు ఆంక్షలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం, కావేరీ యూనివర్సిటీ, గౌరారం గ్రామం, వర్గల్ మండలం వద్ద ఉన్న పరీక్షా కేంద్రం పరిసరాల్లో 500 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు. ఈ ఆంక్షలు మే 23, 2026 నుండి జూన్ 1, 2026 వరకు, ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అమలులో ఉంటాయి.
పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఆయుధాలు, ప్రమాదకర వస్తువులు, లేదా పరీక్షా మెటీరియల్‌కు సంబంధించిన నిషేధిత కాగితాలను కలిగి ఉండటాన్ని కూడా నిషేధించారు. పరీక్షలు జరిగే సమయంలో, పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ప్రింటింగ్, నెట్ సెంటర్లను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.
అయితే, విధుల్లో ఉన్న పోలీస్, సైనిక సిబ్బంది, విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, మరియు అంత్యక్రియల ఊరేగింపులకు ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఇవ్వబడింది. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయడానికి పోలీస్ శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని కమిషనర్ తెలిపారు.
ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.











