జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు.
జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఎంపీ సురేష్ షెట్కర్ అధికారులను ఆదేశించారు. ఎంపీ ల్యాడ్స్, అమృత్ పథకం పనులను వేగవంతం చేయాలని, కోహిర్ మున్సిపాలిటీకి తాగునీటి కనెక్షన్లు, రహదారి నిర్మాణ పనుల్లో జాప్యాన్ని నివారించాలని సూచించారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలని, అర్హులకు పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు. తక్కువ వర్షపాతం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని, రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ వినియోగంపై అవగాహన కల్పించాలని, మహిళా సంఘాలకు డ్రోన్లు అందించాలని ఎంపీ షెట్కర్ సూచించారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, చర్చించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ భవనాలలో సోలార్ వ్యవస్థల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ, నేషనల్ టీబీ నిర్మూలన కార్యక్రమాలపై కూడా చర్చ జరిగింది.












