రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే వచ్చే మొదటి గంట 'గోల్డెన్ అవర్' అత్యంత కీలకమని, ఈ సమయంలో సరైన వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని రామగుండం పోలీస్ కమీషనరేట్ డీసీపీ బి. రామ్ రెడ్డి స్పష్టం చేశారు.
గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో డీసీపీ ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు, ప్రమాదాల అనంతరం తక్షణ వైద్య సహాయం ప్రాముఖ్యతపై దృష్టి సారించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.
వైద్య సిబ్బంది వేగవంతమైన స్పందన, అత్యవసర చికిత్స అందించడం, బాధితులను సమయానికి రిఫర్ చేయడం వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ వైద్యులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించడంలో ట్రాఫిక్ నియమాల పాటింపు అత్యవసరమని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోలీస్, వైద్య సిబ్బంది మధ్య సమన్వయం ప్రాముఖ్యతపై చర్చించారు.











