రత్నపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులపై దాడికి పాల్పడిన హెచ్ఓడిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం కళాశాల ముందు విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు రెడ్డి, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ, కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సుమారు 15 మంది విద్యార్థులపై హెచ్ఓడి కేబుల్ వైర్‌తో విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని ఖండించారు. విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో శారీరకంగా హింసించడం అనేది పూర్తిగా తప్పని, ఇది విద్యార్థుల హక్కులకు విరుద్ధమని తెలిపారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు సంబంధిత హెచ్ఓడిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. వెంటనే అతన్ని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కళాశాల యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరియు విద్యాశాఖ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కే వి ఎల్ ఎన్ రెడ్డి, కళాశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

