భారతరత్న, స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం పాల్గొన్నారు.
పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక భారత సంస్కరణల సృష్టికర్తగా, ఐటీ రంగానికి పితామహుడిగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడిగా రాజీవ్ గాంధీ దేశ ప్రగతికి విశేష కృషి చేశారని కొనియాడారు.
విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూలస్తంభాలని, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీది ఎన్నటికీ చెరగని ముద్ర అని డాక్టర్ సత్యం శ్రీరంగం పేర్కొన్నారు.
గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ పాలన ఆచరణీయమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజీవ్ ఆశయాలను కొనసాగిస్తామని, రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా గెలిపించుకుంటామని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని డాక్టర్ సత్యం శ్రీరంగం ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని ఆయన తెలిపారు.










