నిజామాబాద్, జూలై 22
ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలను నిరసిస్తూ నిజామాబాద్ నగరంలో బుధవారం బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నాయకత్వం వహించారు. కాంగ్రెస్, దానికి మద్దతు ఇస్తున్న పార్టీలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలను నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బుధవారం బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో పాటు దానికి మద్దతు తెలుపుతున్న కొన్ని రాజకీయ పార్టీలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. దేశం అంతర్జాతీయ స్థాయిలో పురోగమిస్తున్న సమయంలో కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
'కాక్రోచ్ పార్టీ' పేరుతో ప్రచారంలో ఉన్న సంస్థ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గతంలో ఆప్ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్‌గా పనిచేశారని పేర్కొన్నారు. అలాంటి సంస్థలకు మద్దతు ఇస్తున్న వారు దేశ వ్యతిరేక శక్తులకు ఊతమిస్తున్నారని ఆరోపించారు. సోనం వాంగ్‌చుక్ గతంలో జాతీయ భద్రతకు విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులపై కూడా ఆయన విమర్శలు చేశారు.
నీట్ పరీక్ష అంశాన్ని ప్రస్తావిస్తూ, ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుని చట్టపరమైన చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొని, స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్, ఇప్పకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, బెల్లాల్ శశాంక్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, న్యాలం సునీత రాజు, బంటు ప్రీతి ప్రవీణ్, మండలాధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











