రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రహవీర్ (RAH-VEER)’ మరియు ‘పీఎం రహత్ (PM RAHAT)’ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్ సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వి. విక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.
ప్రమాదం జరిగిన తొలి గంట (గోల్డెన్ అవర్)లోపు బాధితుడిని ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు రక్షించిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తుందని వెల్లడించారు. ఈ పథకం కింద సహాయం చేసిన వారికి పోలీసు లేదా కోర్టు ఇబ్బందులు ఉండవని, చట్టపరమైన రక్షణ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి సంవత్సరానికి గరిష్టంగా ఐదు సార్లు బహుమతి పొందే అవకాశం ఉంది.
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత (క్యాష్‌లెస్) వైద్యం అందించే ‘పీఎం రహత్’ పథకం అమలులో ఉందని, ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ పథకం జాతీయ రహదారులతో పాటు ఏ రహదారిపై జరిగిన ప్రమాదానికైనా వర్తిస్తుందని వివరించారు.
అనంతరం నిర్వహించిన అప్రిసియేషన్ కమిటీ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ వి. విక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్, జిల్లా రవాణా అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ)తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












