మంతన్ దేవునిపల్లి గ్రామానికి చెందిన గర్భిణీకి నెలలు నిండకుండానే ప్రసవం అవ్వడంతో, పుట్టిన శిశువుకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. సకాలంలో అంబులెన్స్ సిబ్బంది, వైద్యుల స్పందనతో శిశువు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.
పల్వంచ మండలం, మంతన్ దేవునిపల్లి గ్రామానికి చెందిన ఒడ్డే రమ్యకు రెండవ కాన్పులో అత్యవసర నొప్పులు రావడంతో శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో మగ శిశువు జన్మించాడు. పుట్టిన వెంటనే శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పాటు ఏడవకపోవడంతో కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ లోని పిల్లల వైద్య నిపుణులు అత్యవసర చికిత్స అందించారు.
శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో, ఒలిగో హైడ్రామ్యాసిస్ ఎక్కువగా ఉందని నిర్ధారించి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో, ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న చిన్నపిల్లల అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి కృష్ణస్వామి, పైలెట్ రాజేందర్ తక్షణమే స్పందించి, శిశువుకు ఆక్సిజన్ అందించి, ఇంకుబేటర్ లో ఉంచి నిజామాబాద్ కు తరలించే ఏర్పాట్లు చేశారు.
మార్గమధ్యంలో శిశువు నోటి నుండి నురగ రావడంతో, సక్షన్ చేస్తూ వైద్య సేవలు అందిస్తూ నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సకాల స్పందన, అంబులెన్స్ సిబ్బంది సత్వర చర్యల వల్ల శిశువు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. శిశువు తల్లిదండ్రులు, తాతలు అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.












