కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐకేపీ, డీఆర్డీఏ, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది కోసం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 263 మంది ఉద్యోగులు వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో SERP & SRDS Election Insurance TPA Private Limited సౌజన్యంతో, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టారు.
శిబిరంలో రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయిలు (షుగర్), ఈసీజీ, 2డీ ఎకో, కంటి పరీక్షలు వంటి పలు వైద్య పరీక్షలను నిపుణులైన వైద్యులు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి వైద్య సూచనలు, తదుపరి చికిత్సలపై సలహాలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తున్న ఉద్యోగులకు ఆరోగ్య పరిరక్షణ అత్యంత ఆవశ్యకమని, విధి నిర్వహణలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యాలయ ప్రాంగణంలోనే వైద్య సేవలు అందించడం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ సీఈవో, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ దివ్య దేవరాజన్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం, సేవల సామర్థ్యం పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెరిగి పనితీరు మెరుగుపడుతుందని అన్నారు. యశోద ఆసుపత్రి, మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి వైద్య బృందాలు సేవలందించాయి.












