ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం కీసర-బోగారం రోడ్డులోని కేబీఆర్ కన్వెన్షన్లో కీసర ఆర్డీవో రాజేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ప్రముఖ నాయకులు వజ్రేశ్ యాదవ్, సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఎంపికైన 384 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను అతిథులు పంపిణీ చేశారు. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతోందని నేతలు పేర్కొన్నారు.
సమావేశంలో వ్యవసాయ, విద్యుత్, సివిల్ సప్లైస్, హౌసింగ్ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాల పురోగతిని వివరించారు. రైతులకు అందిస్తున్న రాయితీలు, విత్తనాల లభ్యత, ఉచిత విద్యుత్ పథకం అమలు, రేషన్ కార్డుల ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పథకాల అమలులో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, ఆర్టీఏ సభ్యుడు జైపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, ఏడు మండలాల తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.











