నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సులభ్ కాంప్లెక్స్ సమీపంలో సుమారు 35-40 ఏళ్ల వయస్సు గల వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
సమాచారం అందిన వెంటనే టౌన్–1 పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రాథమిక విచారణలో, సరైన ఆహారం, విశ్రాంతి లేకపోవడం, తీవ్రమైన వేడి వాతావరణం కారణంగా ఆరోగ్యం క్షీణించి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. మృతుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వేసవి తీవ్రత దృష్ట్యా, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని, తగినంత నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని టౌన్–1 ఎస్హెచ్ఓ రఘుపతి ప్రజలకు సూచించారు.












