నిజామాబాద్, జూలై 29
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రైతాంగానికి ఊరట లభించింది. ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
ఆలస్యంగానైనా అనుకూలించిన వర్షపాతంతో జిల్లా వ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల ఈ సీజన్ ఆరంభంలో వర్షాలు ముఖం చాటేయడంతో దిగులుపడ్డ రైతాంగానికి, ప్రస్తుతం కురుస్తున్న సమృద్ధి వర్షాలు ఊరటనిస్తున్నాయి. ఈ మబ్బుల గర్జనలు, వాన జల్లులు ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.
నగర శివారు ప్రాంతమైన ఆకుల కొండూర్ సమీపంలోని చెరువు శతాధిక శాతం నీటితో నిండి అలుగు పారుతోంది. నీరు పొంగిపొర్లుతున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వాగుల్లో నీటి ప్రవాహం పెరగడంతో భూగర్భ జలాలు సైతం పెరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో వ్యవసాయ పనుల్లో వేగం పెరిగింది.
రైతులు ఇప్పటికే విత్తనాలు వేసేందుకు దుక్కులు దున్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సరైన సమయంలో వర్షం పడటంతో విత్తనాలు నాటేందుకు, నాట్లు వేసేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా వాగులు ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు, చెరువుల వద్దకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు హెచ్చరించారు.












