ములుగు జిల్లాలోని కర్రెగుట్టల ప్రాంతం ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం లేని ప్రశాంత ప్రాంతంగా అవతరించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, కర్రెగుట్టలపై మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తాయని భరోసా ఇచ్చారు. పామునూరుకు చెందిన ఏడు కుటుంబాలకు ఉమ్మడి జీవనోపాధి కోసం ఒక ఆటో, ద్విచక్ర వాహనాన్ని అందజేశారు.
పర్యాటక కేంద్రంగా కర్రెగుట్టలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, పర్యాటకులకు భద్రత కల్పించేందుకు పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధి కోసం అటవీ, రెవెన్యూ, సీఆర్పీఎఫ్, పోలీస్ శాఖల మధ్య సమన్వయ కేంద్రాన్ని ప్రారంభించారు.
వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో "అరైవ్ అలైవ్" అవగాహన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. 200 మంది వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
డీజీపీ పామునూరులోని సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ బేస్‌ను సందర్శించి జవాన్లతో మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో వారి సేవలు అభినందనీయమని ప్రశంసించారు. కర్రెగుట్టలు వంటి కొండ ప్రాంతాల్లో వ్యూహాత్మక పట్టు సాధించడానికి, మావోయిస్టు రహితంగా కొనసాగించడానికి పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. మొరమురు గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నర్సరీని రాష్ట్ర పీసీసీఎఫ్ సువర్ణతో కలిసి ప్రారంభించారు. అటవీ పెంపకంలో మహిళల భాగస్వామ్యం ద్వారా జీవనోపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని తెలిపారు.











