షెడ్యూల్డు కులాలకు చెందిన నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం 'ఎస్.సి. యాక్షన్ ప్లాన్ 2025-26 ఫేజ్-2' కింద వివిధ స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ సర్వీస్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ పథకం ద్వారా యువతకు పలు రంగాల్లో యూనిట్ల స్థాపనకు రుణ సదుపాయం కల్పించబడుతుంది.
అందించే యూనిట్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర ఎలక్ట్రిక్ ఆటోలు, సోలార్ యూనివర్సల్ పంప్ సెట్లు, వ్యవసాయ డ్రోన్ సేవలు, వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలు, పాడి బర్రెలు, మల్బరీ సాగు, కిసాన్ నర్సరీలు, ఆయిల్ పామ్ సాగు వంటివి ఉన్నాయి. ఐదుగురు సభ్యుల బృందాలు వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను స్థాపించుకోవచ్చు.
అర్హత ప్రమాణాలలో భాగంగా, వయోపరిమితి 21-50 ఏళ్లు (వ్యవసాయ/సోలార్ పథకాలకు 21-60 ఏళ్లు) మరియు ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు నిర్ణయించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ పుస్తకం వంటి పత్రాలు అవసరం.
అర్హులైన అభ్యర్థులు టి.జి.ఓ.బి.ఎం.ఎం.ఎస్ పోర్టల్ ద్వారా ఏప్రిల్ 2, 2026 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం జిల్లా కలెక్టరేట్ లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని లేదా 040-24020610 నంబర్‌ను సంప్రదించవచ్చు.











