పారదర్శక ఇసుక సరఫరా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మన ఇసుక – మన వాహనం” ఆన్లైన్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని, ఆన్లైన్ దరఖాస్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
జిల్లాలో ఇసుక సరఫరా ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా స్థానిక గృహ నిర్మాణదారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇసుక అవసరమైన వినియోగదారులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో ఆన్లైన్ అప్లికేషన్, పంచాయతీ సెక్రటరీ పరిశీలన, తహసీల్దార్ అనుమతి, ఆన్లైన్ చెల్లింపు వంటి దశలు ఉంటాయి. అనుమతి పొందిన తర్వాతే QR కోడ్ ద్వారా ఇసుకను తీసుకోవచ్చు.
ధరల వివరాలు కూడా స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.14.2, స్థానిక గృహ నిర్మాణదారులకు రూ.900, ప్రభుత్వ పనులకు రూ.660 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇసుక లభ్యతను బట్టి రీచ్ మార్చుకునే అవకాశం కూడా కల్పించారు.
ఈ విధానం ద్వారా ఇసుక సరఫరాలో పారదర్శకత, వేగం పెంచడంతో పాటు ప్రజలకు సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివరించారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలించవద్దని ఆయన హెచ్చరించారు.












