సూర్యాపేట జిల్లా, కోదాడలోని కిడ్స్ కాలేజ్‌లో బీటెక్ విద్యార్థిని భవనం పై నుంచి కిందపడిన ఘటనపై ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపిస్తూ, బాధితురాలి కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం డిమాండ్ చేశారు.
ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ సంఘటనపై ఎంఆర్పిఎస్ నాయకులు కళాశాలను సందర్శించి, ప్రిన్సిపాల్‌తో పాటు విద్యార్థులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ ఘటనకు కళాశాల యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని, లేనిపక్షంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థినుల భద్రత విషయంలో కళాశాల విఫలమైందని, వెంటనే కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గదుల వద్ద సేఫ్టీ గ్రిల్లులు ఏర్పాటు చేయాలని, బాధితురాలికి అత్యుత్తమ వైద్య చికిత్స అందించే బాధ్యతను యాజమాన్యమే తీసుకోవాలని కోరారు.
యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉద్యమాలు, ఆందోళనలు, కళాశాల ముట్టడులు తప్పవని ఎంఆర్పిఎస్ తీవ్రంగా హెచ్చరించింది.











