కామారెడ్డి జిల్లాలో జాతీయ పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ పర్యటించి, కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
రాష్ట్ర ప్రత్యేక అధికారి, జాయింట్ డైరెక్టర్ డా. వెంకటరమణ ఆదివారం కామారెడ్డి జిల్లాలోని బికనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పల్స్ పోలియో బూత్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించి, ఒక చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
డా. వెంకటరమణ మాట్లాడుతూ, జిల్లాలో ఐదేళ్లలోపు మొత్తం 1,03,678 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చూడాలని సూచించారు.
జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్. జె.వెంకటి ఆదేశాల మేరకు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి, వారికి చుక్కలు వేయడంతో పాటు, ఇంటికి 'X' మార్క్ వేయనున్నారు. ప్రత్యేక ప్రాంతాలలో కూడా పిల్లలను గుర్తించి టీకాలు వేయాలని సూచనలు జారీ చేశారు.
పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డాక్టర్. వెంకటి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రోహిత్ కుమార్, చలపతి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










