కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం మర్కల్లో గల తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్స్ ఫైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐఎస్ఆర్డీ) స్వచ్ఛంద సంస్థ సహకారంతో చేపట్టారు.
వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ శ్రీమతి ప్రియాంక, మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి విద్య, ఉపాధి, సమాన హక్కులు కల్పించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని ధైర్యంగా ముందుకు సాగాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. శోభ రాణి సూచించారు.
విద్య, ఆత్మవిశ్వాసం, కృషి ద్వారా మహిళలు అన్ని రంగాలలో ఉన్నత స్థానాలను అధిరోహించగలరని ఆమె తెలిపారు. ఐఎస్ఆర్డీ సంస్థ అధ్యక్షురాలు సోలంకి రవళి మాట్లాడుతూ, మహిళల సాధికారత, సమాన హక్కులపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, స్త్రీలు అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మహిళా సాధికారతపై ప్రసంగించి కార్యక్రమాన్ని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కృష్ణవేణి, ఐఎస్ఆర్డీ సంస్థ కార్యదర్శి అమృత రాజేందర్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


