రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో భద్రతా అవగాహనను పెంపొందించే లక్ష్యంతో కామారెడ్డి జిల్లాలో ఏప్రిల్ 13 నుంచి 18 వరకు 'అరైవ్ అలైవ్' పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
కార్యక్రమాల్లో భాగంగా ఏప్రిల్ 13న గ్రామస్థాయిలో రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు, 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రహదారి భద్రతపై ప్రతిజ్ఞలు ఉంటాయి. 15న విద్యార్థులకు హెల్మెట్, సీట్‌బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు.
16న సోషల్ మీడియా ద్వారా ప్రచారం, డ్రైవర్లపై తనిఖీలు, 17న గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై శిక్షణ, 18న ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాలు ఉంటాయి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.












