తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ఏప్రిల్ 25వ తేదీన ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆమె నిజామాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కొత్త పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ కూడా ఏప్రిల్ 25నే జరుగుతాయని కవిత తెలిపారు. మేడ్చల్ మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మార్పును కోరుకునే అభ్యుదయ వాదులందరూ తనతో కలిసి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్‌ను తన మెట్టినిల్లుగా అభివర్ణించిన కవిత, ఇక్కడి నుంచి తీసుకునే నిర్ణయాలు దేశాన్ని ప్రభావితం చేస్తాయని అన్నారు. తెలంగాణలో బలమైన రాజకీయ శక్తి అవసరమని, సర్వోదయ తెలంగాణ సాధన కోసం ఈ కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు దాటినా, ఆశించిన పురోగతి సాధించలేకపోయామని ఆమె అభిప్రాయపడ్డారు.
కొత్త తరం నాయకత్వానికి, మహిళా సాధికారతకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని కవిత వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వర్గాల్లో ఈ కొత్త పార్టీ ప్రభావంపై విశ్లేషణలు మొదలయ్యాయి.
రాష్ట్ర సెంటిమెంట్‌తో పాటు సాంస్కృతిక మూలాలను బలంగా విశ్వసించే కవిత, ఈ పార్టీ ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. తన అజెండా ఏమిటనేది పార్టీ ఆవిర్భావం రోజున ప్రకటిస్తానని ఆమె తెలిపారు.










