వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, పారదర్శకమైన భోజనం అందించేందుకు అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ విధానానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన, రుచికరమైన, సాంకేతికంగా, పారదర్శకంగా భోజనం అందించే లక్ష్యంతో కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ వినూత్న విధానానికి జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని ప్రత్యేకంగా అభినందించారు.
గురువారం ఒంటిమిట్ట టిటిడి అతిధి గృహంలో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్కోచ్ అవార్డు జ్ఞాపికను చూపించి, స్మార్ట్ కిచెన్ అమలు తీరును వివరించారు. అవార్డును పరిశీలించిన ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ, కలెక్టర్‌తో పాటు అధికార యంత్రాంగాన్ని ప్రశంసించారు. స్మార్ట్ (సేఫ్, మోడ్రన్, ఆటోమేటెడ్, రిలైబుల్, ట్రాన్స్పరెంట్) కిచెన్ ప్రాజెక్ట్ ద్వారా ఆహార భద్రత, పారదర్శకత, ఆధునిక సాంకేతికత వినియోగం మెరుగుపడ్డాయని స్కోచ్ సంస్థ పేర్కొంది. ఈ అవార్డు కడప జిల్లా పరిపాలనకు జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మరో 33 స్మార్ట్ కిచెన్లు నిర్మాణంలో ఉన్నాయని, వాటిలో 7 కిచెన్లను వారం రోజుల్లో పూర్తి చేస్తామని, మిగిలిన 26 కిచెన్ల పనులను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన కూడా పాల్గొన్నారు.










