టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం బెంగళూరులో కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన 'స్పెషాలిటీ బ్లాక్'ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన తాతగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆసుపత్రి ప్రారంభోత్సవ సభలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, "1983 మార్చి 20న మా తాతగారు ఈ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. సరిగ్గా ఇన్నాళ్లకు అదే మార్చి నెలలో ఆ భవనాన్ని ప్రారంభించే అవకాశం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇది కేవలం తాతగారి ఆశీస్సులు, మీ అందరి ప్రేమ వల్లే సాధ్యమైంది" అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఆయన చెవికి ఉన్న 'రింగ్' (పోగు) హైలైట్‌గా నిలిచింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న యాక్షన్ చిత్రం కోసం తారక్ ఈ స్టైలిష్ లుక్‌లోకి మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కార్యక్రమంలో భాగంగా అక్కడి వైద్యులు అడిగిన ప్రశ్నలకు ఎన్టీఆర్ తనదైన శైలిలో చమత్కారంగా సమాధానాలిచ్చారు. "ఒకవేళ మీరు నటుడు కాకుండా డాక్టర్ అయ్యుంటే ఏ స్పెషలిస్ట్ అయ్యేవారు?" అని అడగ్గా, "నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, అందుకే ఖచ్చితంగా పీడియాట్రిషియన్ (చిన్నపిల్లల వైద్యుడు) అయ్యేవాణ్ణి" అని చెప్పారు. అలాగే 25 ఏళ్ల తర్వాత మీ లుక్ ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు "అప్పటికి నా వయసు 67 ఏళ్లు ఉంటుంది" అంటూ నవ్వులు పూయించారు.

