గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు 14-15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పిలుపునిచ్చారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ బాలికల ఆరోగ్యానికి అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. జిల్లావ్యాప్తంగా మూడు నెలల పాటు ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందని, ప్రతి అర్హత కలిగిన బాలికకు టీకా అందేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. పాఠశాలల్లో తల్లిదండ్రులకు వ్యాక్సిన్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పలువురు పాల్గొన్నారు. ఇందులో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. కౌశిక్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డా. లావణ్య రెడ్డి, డా. సత్యవతి, ప్రోగ్రామ్ అధికారులు డా. శ్రీదేవి, డా. చంద్రకళ, డా. గీత, డా. నాగరాజ్ ఉన్నారు.











