మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 14-15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయాలని కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. కీసరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గర్భాశయ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో, బాలికలకు టీకా ప్రాముఖ్యతను కలెక్టర్ వివరించారు. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో చదువుతున్న బాలికలందరికీ టీకా అందేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు.
సంబంధిత శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో బాలికలను గుర్తించి, సమీకరించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్పీవీ టీకాపై విస్తృత అవగాహన కల్పించాలని, తల్లిదండ్రులకు తెలియజేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమం అనంతరం కలెక్టర్ పీహెచ్సీని పరిశీలించి, మరమ్మతుల కోసం నిధుల మంజూరు గురించి ఆరా తీశారు. అదనపు నిధులు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. మందుల గదిని తనిఖీ చేసి, గడువు ముగిసిన మందులపై అప్రమత్తంగా ఉండాలని, నాణ్యమైన మందులు మాత్రమే అందించాలని సిబ్బందిని ఆదేశించారు.











