తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యారంగంలో మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి కీలక అంశాలపై చర్చించారు.
ఆదివారం నాడు జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. గవర్నర్, సీఎం మధ్య విద్యారంగానికి సంబంధించిన వివిధ అంశాలపై సంభాషణ జరిగింది.
విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్యమంత్రికి సూచించారు. దీనికి సంబంధించి విద్యార్థుల నుంచి ప్రమాణం చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
జూన్ 12న ఎల్బీస్టేడియంలో గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అవగాహన కార్యక్రమం గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాల సమయంలోనే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల నుంచి ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించారు.
గవర్నర్ చేసిన సూచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.











