మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, గంజాయి సాగు చేస్తే రైతు పథకాలు రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన జిల్లాస్థాయి నార్కో సమన్వయ సమావేశంలో కలెక్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నమోదవుతున్న ఎన్డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వాడకం నియంత్రణ, శాఖల వారీగా చేపట్టాల్సిన పనులు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై చర్చించారు.
మాదక ద్రవ్యాల నిర్మూలన వాల్‌పోస్టర్లు, హ్యాండ్‌బుక్‌లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి చర్యలు తీసుకోవాలని, పాఠశాలల పరిసరాల్లోని పాన్‌షాప్‌లపై నిఘా పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో బహిరంగ మద్యం సేవించకుండా చూడాలని, ప్రతి మండలంలో డ్రగ్స్ నియంత్రణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
జిల్లాలోని సినిమా థియేటర్లు, బార్లు, వైన్‌షాప్‌ల వద్ద నిఘా పెంచాలని, ప్రభుత్వ నిర్ధేశిత సమయపాలన పాటించేలా చూడాలని కలెక్టర్ సూచించారు. డ్రగ్స్ నియంత్రణపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలను వివరించే వీడియోలు, పోస్టర్లు ప్రదర్శించాలని, అవగాహన కల్పించాలన్నారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలలో ప్రత్యేక నిఘా పెట్టి అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని సూచించారు. జిల్లాలోని రైతులు రహస్యంగా గంజాయిని సాగు చేస్తే రైతు భరోసా, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. డిఅడేక్షన్ సెంటర్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించి, సేకరించాలని ఆదేశించారు.







