కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలోని ఉద్యోగుల ప్రాన్ (పీఆర్ఏఎన్) ఖాతాల్లోని నిధులు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో వచ్చిన తీవ్ర పతనం కారణంగా ఉద్యోగుల పెన్షన్ ఖాతాల్లోని సొమ్ము ఆవిరవుతోందని నివేదికలు సూచిస్తున్నాయి.
ఒక్కో ఉద్యోగి ప్రాన్ ఖాతా నుంచి సగటున 4 నుంచి 7 శాతం మేర నిధులు తగ్గడం సీపీఎస్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. మార్చి 14వ తేదీన ఒక ఉద్యోగి ఖాతాలో రూ.18.88 లక్షలు ఉండగా, మార్చి 31 నాటికి రూ.18.17 లక్షలకు పడిపోయింది. కేవలం రెండు వారాల్లో రూ.70,567 తగ్గింది.
మరొక ఉద్యోగి ఖాతాలో మార్చి 18న రూ.20.93 లక్షలు ఉండగా, మార్చి 31 నాటికి రూ.20.51 లక్షలకు పడిపోయింది. 12 రోజుల్లో రూ.41,704 కోత పడింది. ఈ పరిణామాలు ఉద్యోగుల పదవీ విరమణ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
సీపీఎస్ విధానంలో, ఉద్యోగి, ప్రభుత్వం చెల్లించే వాటాను ప్రత్యేక సంస్థలు మార్కెట్లో పెట్టుబడులు పెడతాయి. ప్రస్తుత అంతర్జాతీయ యుద్ధ వాతావరణంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్ పతనం అవుతున్నా, తిరిగి సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు కనిపించకపోవడంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం (టీఎస్సీపీఎస్ఈయూ) అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, 'సీపీఎస్ విధానంలో ఉద్యోగి భవిష్యత్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వోద్యోగుల పెన్షన్‌పై కార్పొరేట్ పెత్తనం సాగనివ్వొద్దు. తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి' అని డిమాండ్ చేశారు.











