నిజామాబాద్, ఆగస్టు 1
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు నిజామాబాద్‌లో బీజేవైఎం నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, రాష్ట్రంలోని విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచే ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం వారిని అవమానించే విధంగా మాట్లాడడం తగదని పేర్కొన్నారు. విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను బీజేవైఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిరసన కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు విపుల్ రావు, రాజ్ గణేష్, కలిగోట్ ప్రశాంత్, మహేష్, దినేష్, రఘు, కార్తీక్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










