మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ తన సొంత నిధులతో చిట్కుల్ లో నిర్మించిన శ్రీ రామచంద్రస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ధర్మ రక్షణ ధ్యేయంగా, భక్తి భావంతో నీలం మధు ముదిరాజ్ ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ జిటిఎన్ కాలనీలో నిర్మించిన ఈ దేవాలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమయ్యాయి.
ప్రతిష్టా మహోత్సవాలలో మొదటి రోజున, నీలం మధు దంపతుల ఆధ్వర్యంలో ఉదయం గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనము వంటి క్రతువులు నిర్వహించారు. అనంతరం దీక్షాధారణ, రక్షాబంధన, యాగశాల సంస్కారము వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అఖండ దీపస్థాపన, వాస్తు మండపారాధనలు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.
సాయంత్రం, ప్రతిష్టా మూర్తులకు పంచవింశతి (25) కలశ స్నపనం (బింబ శుద్ధి) నిర్వహించారు. అనంతరం దీక్షాధారణ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, యాగ మండప దేవతా హవనములు జరిగాయి. వాస్తు, నవగ్రహ, క్షేత్రపాల దేవతలకు హోమాలు నిర్వహించి పూర్ణాహుతితో మొదటి రోజు కార్యక్రమాలు ముగిశాయి.
అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకలకు చిట్కుల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.












