అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఆలయ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, కళ్యాణ మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. జాతరకు లక్షకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో, వారి సౌకర్యార్థం చలువ పందిర్లు, తాగునీటి సరఫరా, శానిటేషన్ వంటి ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, మెడికల్ క్యాంప్ వంటి ఏర్పాట్లను ముందస్తుగా చేపట్టాలని సూచించారు.
భక్తులతో పోలీసులు స్నేహపూర్వక సంబంధాన్ని కలిగి ఉండాలని, ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలని కోరారు. స్వామివారి భక్తి సేవలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, సీపీ ఈ సమీక్ష సమావేశానికి హాజరుకాకపోవడం బాధాకరమని, జిల్లా కలెక్టర్ ఆలయానికి తక్షణమే 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ, గత సంవత్సరం కంటే మెరుగ్గా బ్రహ్మోత్సవాలను జరుపుకోవాలని, వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఆర్డీవో రమేష్ బాబు వివిధ శాఖల అధికారులతో సమన్వయపరుస్తూ బ్రహ్మోత్సవాలు సజావుగా జరిగేటట్లు ప్రతిరోజూ పర్యవేక్షించాలని కోరారు. ఆర్ అండ్ బి ఈఈ రాజశేఖర్ రెడ్డి కళ్యాణ మండపం వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. విఐపి, వీఐపీ, డోనర్స్ గ్యాలరీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, కల్యాణదాతలకు వేరుగా ఉండాలని తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం జమ్మికుంట నుండి ఇల్లందకుంట దేవస్థానం వరకు 10 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి నడపాలని డిపో మేనేజర్ రవీందర్ రెడ్డిని కోరారు. పార్కింగ్ స్థలాలను గుర్తించి, వాహనాల ట్రాఫిక్‌ను నియంత్రించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది చూసుకోవాలని కోరారు. ఆలయ ప్రాంగణంలో 108 సర్వీస్ వాహనాలను, నాలుగు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులను అందుబాటులో ఉంచాలని కోరారు. కోనేరు వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల్లో వివిధ శాఖల అధికారులు ఒకరికొకరు సమన్వయంతో మెరుగ్గా జరిగేటట్లు కృషి చేయాలని కోరారు.











