రాష్ట్ర శాసనసభలో గడ్డి మందు (Paraquat dichloride)ను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్వాగతించారు. ఈ నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గడ్డి మందు వాడకం వల్ల సమాజంలో తీవ్ర దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, వందలాది మంది వ్యక్తులు, యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
గడ్డి మందు వల్ల జరుగుతున్న దుష్పరిణామాలపై గత రెండు నెలలుగా తాను గళమెత్తి పోరాడుతున్నానని, ఇప్పుడు ఆ పోరాటానికి ఫలితం దక్కిందని వినోద్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిషేధం అమల్లోకి వస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
గడ్డి మందును నిషేధించాలని కోరుతూ గత ఫిబ్రవరి 21న తెలంగాణ భవన్లో పత్రికా సమావేశం నిర్వహించానని, అనంతరం మార్చి 3న అఖిలపక్షం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహా పలువురితో కలిసి నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలోనూ దీని దుష్ప్రభావాలపై అవగాహన కల్పించినట్లు ఆయన వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజారోగ్యానికి, సమాజ శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతుందని వినోద్ కుమార్ అన్నారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.











