భద్రాచలం పట్టణాన్ని పోలవరం ముంపు నుండి రక్షించేందుకు కరకట్ట పునర్నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని, అలాగే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలోనే ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై తీర్మానం చేసి భద్రాచలం అభివృద్ధికి భరోసా కల్పించాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్లను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, భద్రాచలం కరకట్ట పునర్నిర్మాణం చేపట్టకపోతే రామాలయం చుట్టూ చేపట్టే అభివృద్ధి పనులు నిష్ఫలమవుతాయని, శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. రామాలయ అభివృద్ధి, భద్రాచలం పట్టణ సుందరీకరణకు ప్రతిపాదించిన 580 కోట్ల రూపాయలను ఒకేసారి విడుదల చేసి, నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.
మాడవీధుల అభివృద్ధి కోసం తమ నివాస, వ్యాపార స్థలాలను కోల్పోయిన పేదలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద హామీ ఇచ్చిన విధంగా శ్రీరామనవమి రోజునే ఇంటి స్థలాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయాలని కోరారు. ఇప్పటికే స్థల గుర్తింపు, భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో, సేకరించిన భూమిని వెంటనే పేదలకు అందించాలని సూచించారు.
ఆరు సంవత్సరాలుగా భద్రాచలం కేంద్రంగా ఇసుక రీచ్ ప్రారంభం కాకపోవడానికి అధికార పార్టీకి చెందిన నాలుగు వర్గాలు నాలుగు గిరిజన సొసైటీలను నమోదు చేసుకోవడమే కారణమని ఆరోపించారు. మంత్రులు జోక్యం చేసుకొని ప్రభుత్వ ఇసుక రీచ్ ను ప్రారంభించి, పట్టణ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని డిమాండ్ చేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు వలసపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఈ సమస్యకు ప్రభుత్వమే పరిష్కారం చూపాలని కోరారు.
అలాగే, భద్రాచలం నుండి వెంకటాపురం వరకు ధ్వంసమైన రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించి, పనులు ప్రారంభించాలని సూచించారు. ఐదు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేస్తేనే భద్రాచలం అభివృద్ధికి భరోసా కలుగుతుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.











