రాష్ట్ర బీసీ సంక్షేమ విద్యాసంస్థలు నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలతో ఆదర్శంగా నిలుస్తున్నాయని బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు బీసీ వర్గాలకు మాత్రమే కాకుండా సమాజానికే ఆదర్శం నిలిచారని కొనియాడారు.
రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతి గృహాల విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయులు, వార్డెన్లు, అధికారులు, సిబ్బంది, తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బీసీ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.110 కోట్ల డైట్ బిల్లులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేసిందన్నారు. విద్యార్థులతో సన్నబియ్యంతో కూడిన భోజనం అందిస్తున్నామన్నారు. హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, మస్కిటో మెష్‌లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. సీఎస్ఆర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్, ప్రభుత్వ నిధులతో హాస్టళ్లలో మరమ్మతులు చేపడుతున్నామన్నారు.
విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలన్న ఉద్దేశంతో త్వరలో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయనున్నామని మంత్రి సవిత తెలిపారు. వంట గదుల సామగ్రి కోసం రూ.18 కోట్ల నిధులు ఖర్చు చేశామన్నారు. ఎంజేపీ గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఎంజేపీ గురుకులాల్లో రూ.1.50 లక్షలు, బీసీ హాస్టళ్లలో రూ.75 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల సంఖ్యను గతంలో 42 నుంచి 109కి పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని మంత్రి గుర్తుచేశారు.
నెల్లూరుకు చెందిన ప్రణీత టెన్త్ లో 589 మార్కులు సాధించినందుకు మంత్రి సవిత సన్మానించారు. ఈ సందర్భంగా వేదికపై విద్యార్థిని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, తన విజయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లి లక్ష్మీదేవి పాత్ర కూడా ఉందని పేర్కొంది. అదే సమయంలో పక్కనే నిల్చున్న విద్యార్థిని తల్లి లక్ష్మీదేవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కడుపున బిడ్డ ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతుండడంతో ఆమె ఆనందభాష్పాలు రాల్చారు. తన బిడ్డ విజయాన్ని చూసి ఉప్పొంగిపోతున్న ఆ మాతృమూర్తిని చూసిన వారి కళ్లు కూడా చమర్చాయి.










