కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యధిక కాన్పులు నిర్వహించినందుకు గాను రాష్ట్ర స్థాయి “ఉత్తమ ఆసుపత్రి” పురస్కారానికి ఎంపికైంది. ఈ పురస్కారాన్ని హైదరాబాద్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయ భాస్కర్ అందుకోనున్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం, బాన్సువాడ ఆసుపత్రికి దక్కిన ప్రత్యేక గుర్తింపు. అధిక సంఖ్యలో సురక్షితమైన ప్రసవాలు నిర్వహించడంలో ఆసుపత్రి సాధించిన ప్రగతికి ఇది నిదర్శనం.
వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఆసుపత్రి సిబ్బందిలో సంతోషం వెల్లివిరిసింది. ఈ పురస్కారం తమ సేవలకు లభించిన గుర్తింపుగా వారు భావిస్తున్నారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయ భాస్కర్ మాట్లాడుతూ, ఈ పురస్కారం ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి అంకితమని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.











