కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి, విదేశాలకు పారిపోకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత, బండి సంజయ్ కుమారుడిపై గంభీరమైన ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆయన ప్రధానితో వేదిక పంచుకోవడం శోచనీయమని అన్నారు. కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చినప్పుడు బండి సంజయ్ ఆ సమావేశానికి హాజరు కావడం సరికాదన్నారు. బడాబాబుల పిల్లలు ఏం చేసినా పోలీసులు చర్యలు తీసుకోరన్న అభిప్రాయం ప్రధాని సభతో ప్రజల్లోకి వెళ్లిందని ఆమె ఆరోపించారు.
నిందితులను దేశం దాటించే అలవాటు బీజేపీకి ఉందని, ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఇది నిరూపితమైందని కవిత గుర్తు చేశారు. బండి సంజయ్ కుమారుడు దేశం దాటిపోకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కొందరు ట్వీట్స్ చేస్తూ సమస్యను పరిష్కరించినట్లు బిల్డప్ ఇస్తున్నారని, అలాంటి పార్టీ వారు తానేందుకు స్పందించలేదని అడ్డగోలుగా కామెంట్లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ఆడపిల్ల విషయం, అందులోనూ మైనర్ విషయంలో స్పందించే ముందు సంయమనం పాటించాలని కవిత సూచించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫోటోలు బయటకు వచ్చాయని, ఇది బాధితుల జీవితాన్ని నష్టపరిచే ప్రమాదం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫోటోలు పోస్ట్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు మరోసారి మొండి చెయ్యి చూపించారని కవిత విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇస్తారని భావించిన తమకు, ప్రధాని పొదుపు సూత్రాలు చెప్పి, ఆంధ్రకు నిధులు ఇచ్చి వెళ్లిపోయారని ఆమె ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్ట్ జాతీయ హోదా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని, దీనిపై ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని కవిత ప్రశ్నించారు.











