ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, త్వరలోనే బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. ఈ చట్టం ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని, కులం లేదా వృత్తి పేరుతో ఎవరినైనా దూషించినా, వేధించినా కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
విజయవాడలోని తాడిగడప బీసీ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర బీసీ రక్షణ చట్టం విధివిధానాలపై చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో భాగంగా, చట్టం డ్రాఫ్ట్‌పై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధుల నుండి అభిప్రాయాలు స్వీకరించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ, బీసీల మానప్రాణాలకు భరోసా కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. "కోర్టుల్లోనూ నిలబడేలా న్యాయనిపుణులతో సంప్రదించి చట్టాన్ని రూపొందించాం. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నాం" అని ఆమె పేర్కొన్నారు.
చర్చలో వెలువడిన కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి సవిత తెలియజేశారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు.

