డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్గా పదోన్నతి పొందిన శ్రీమతి వైఖోమ్ నిడియా దేవి గురువారం అమలాపురం కలెక్టరేట్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయడంలో జాయింట్ కలెక్టర్ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
నూతన జాయింట్ కలెక్టర్కు జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. జిల్లా పాలనలో సమన్వయంతో పనిచేస్తూ తమ వంతు సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైఖోమ్ నిడియా దేవి మాట్లాడుతూ, కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఆమె పేర్కొన్నారు.
అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఎ. ఉదయభాస్కర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ పి. శ్రీనివాస్, ఎల్డిఎం కేశవ వర్మతో పాటు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.











