తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 15% ఎస్సీ రిజర్వేషన్లను ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు కూడా వర్తింపజేయాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరింది.
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి: షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
రాష్ట్రంలో ఎస్సీ కులాలకు అమలు చేస్తున్న 15 శాతం రిజర్వేషన్లను ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు స్థానికంగా అమలు చేయాలని, ఈ నెల 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల అభివృద్ధిలో జరుగుతున్న వివక్షత, అన్యాయాన్ని గుర్తించి అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు కల్పించినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు స్థానిక సంస్థల్లో ప్రత్యేకంగా 15% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు తెచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టం, రెవెన్యూ చట్టాల వల్ల ఏజెన్సీ ప్రాంత ఎస్సీలు ప్రజా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం కోల్పోవడంతో పాటు, పంట రుణాలు పొందే అవకాశాన్ని కూడా కోల్పోయారని ఆరోపించారు.
అలాగే, అంగన్వాడి, ఆయా, అటెండర్ వంటి స్థానిక ఉద్యోగ నియామకాల్లోనూ ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేదలైన ఎస్సీలను అభివృద్ధి పరంగా గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

