జిల్లాలో జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 15 వరకు నిర్వహించబడతాయి.
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్, పరీక్షల నిర్వహణపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 24,657 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానుండగా, వారి కోసం 123 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు చేసి, తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిసరాల్లోని జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని స్పష్టం చేశారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి వసతి, పరిశుభ్రమైన వాతావరణం, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స సదుపాయం తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతి కేంద్రంలో ఫుల్ టైమ్ స్కావెంజర్ను నియమించి మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు.
విద్యార్థులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఎంఈఓలు పరీక్షా కేంద్రాలను ముందస్తుగా తనిఖీ చేసి, అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ షీట్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను అనుమతించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు.


