కుటుంబ నిర్వచనం పరిధి నుంచి వివాహిత కుమార్తెను మినహాయించడం ఏకపక్షమని, అన్యాయమని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధే ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
తండ్రి మరణానంతరం అతని స్థానంలో చౌక ధరల దుకాణం లైసెన్స్‌ను తనకు కేటాయించాలన్న కుమార్తె అభ్యర్థనను ధర్మాసనం సమర్థించింది. ఆమెకు ప్రతికూలమైన తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
రేషన్ షాపు డీలర్ మృతితో తల్లికి అండగా ఉంటూ ఆ కుటుంబ భారాన్ని పిటిషనర్ మోస్తున్నారని, వివాహమైనప్పటికీ పుట్టింట్లోనే ఉంటూ దివ్యాంగురాలైన సోదరి సంరక్షణతోపాటు కుటుంబ బాధ్యతలను మోస్తున్నారని సుప్రీంకోర్టు గుర్తించింది. తల్లి మరణానంతరం ఆ రేషన్ షాప్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.
తండ్రి, తల్లి మృతితో కుటుంబ సభ్యులు పిటిషనర్‌పై ఆధారపడటం, చౌక ధరల దుకాణం ఉన్న గ్రామంలోనే పిటిషనర్ జీవిస్తున్న విషయాన్నీ ధర్మాసనం ప్రస్తావించింది. ఈ వాస్తవాలను అధికారులు కూడా అంగీకరించారని తెలిపింది. పిటిషనర్‌కు చౌక ధరల దుకాణం లైసెన్స్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
వివాహమైనంత మాత్రాన కుమార్తెతో కుటుంబ బంధం ముగిసిపోదని, కొనసాగుతూనే ఉంటుందని ధర్మాసనం తెలిపింది. వివాహమైన కుమారుడు విడిగా దూరంగా ఉంటున్నప్పటికీ కుటుంబ సభ్యుడిగా పరిగణిస్తూ.. కుమార్తె విషయంలో భిన్నంగా ఆలోచించడం లింగ వివక్షేనని ధర్మాసనం అభిప్రాయపడింది.











